Thursday, September 12, 2013

నీ గతములో నేనుండనా?, ఈ గీతమై నేనుండనా?…

ఏవో జ్ఞాపకాలు హడావిడిగా మదిలో పరుగులిడుతుంటే,ఎన్నెన్నో అనుభవాలు ఎదలో ఎగసి పడుతుంటే,

మధురవాణివో, మనసైన దానివో,
ఎంకివో, ఎద సంపంగివో,,
ఎవరివో, నీవెవరివో…

అందుకో, నన్నందుకో,
ఎందుకో, ఎద పొందుకో,
మనసందుకో, మది విందుకో,  
అందనీ మనసెందుకో, మది కెందుకో…


అని ఎన్ని సార్లు అనుకున్నా,     

కన్నుల ముందు,కను రెప్పల మాటున, ఆ రూపం నీది కదూ.  

నా మనసు కనురెప్పల కదలిక నీవు,
నా మదిలో నీ రూపం కదలనీవు,
కనుపాపల కలవరింతల కథలన్నీ నీవు,
కలలుగానే నన్ను వదలి కదలిపోయేవు.

నాలో కలలు రేపిన నీ కళ్ళు,
నాకై ఇక కరుగు నెడదల్లు,
వంచించితే వలపు వాకిళ్ళు,
వరదయ్యేనే కనుల కన్నీళ్ళు.

కలలో నీ కళ్ళు,
కలల లోగిళ్ళు
కల్లలై నా కళ్ళు
కదిలె కన్నీళ్ళు

మరువ లేదు, విడువ లేదు,
మరపు రాని ఊసులు
తిరిగిరావు, మరలిపోవు
మరచిపోని బాసలు

ఎందుకనో నువ్వు గుర్తొచ్చావు. నీ జ్ఞాపకం పురి విప్పింది.

నీ జ్ఞాపకాల తోడుగా, నా గతం “వెలుగు” నీడగా,
వుండనా, నేనుండనా?
నీ గతములో నేనుండనా?
ఈ గీతమై నేనుండనా?

నీ నేను

No comments:

Post a Comment