Saturday, May 3, 2014

పేదరాలిపై పైశాచికం

- మెదక్‌ జిల్లా తునికిబొల్లారంలో మరో 'నిర్భయ'కాండ
మూడు రోజులుగా వెలుగుచూడని ఘోర కలి
            అత్యాచారాలకూ మార్కెటు విలువలుంటాయా? అని ప్రశ్నించుకుంటే ప్రతిదీ వ్యాపారమయమైన నేటి సమాజంలో అవుననే అనిపిస్తుంది. రాక్షసత్వాన్ని రచ్చకీడ్చాల్సిన మీడియా స్పందించలేదు. పైశాచికత్వాన్ని ప్రజల ముందుకు తెచ్చి కిరాతకాన్ని కడిగిపారేయేయాల్సిన మీడియా మూగవోయిందెందుకు? ఢిల్లీలో వైద్య విద్యార్థినిపై జరిగిన దారుణ అత్యాచారాన్ని అంతర్జాతీయ స్థాయిలో సంచలనాత్మకం చేసిన మీడియా, రాజధాని హైదరాబాదుకు సమీపంలోని ఓ పల్లెలో ఘోరాతిఘోరంగా జరిగిన సామూహిక అ
త్యాచారాన్ని, అవమానంతో ఆమె ప్రాణాలు తీసుకున్న వైనాన్ని నిలువునా పాతరేసింది. ఈ దుర్యోధన, దుశ్శాసన పర్వంలో ఓ పేదరాలి ఘోషను వినబడకుండా చేసింది. ఎన్నికల జాతరతో హోరెత్తిన మీడియాలో కొన్ని మానవ మృగాలు జరిపిన వికృత క్రీడ వార్త కాకుండా పోయిందా? 'ప్రజాశక్తి, 10టివి' ఈ దారుణాన్ని వెలికి తెచ్చాయి. మెదక్‌ జిల్లా తునికిబొల్లారంలో జరిగిన ఈ ఘోర కలి సమాజానికి తీరని అవమానంగా మిగిలింది.

ప్రజాశక్తి-హైదరాబాద్‌ బ్యూరో
                       తునికి బొల్లారంలో యాదమ్మ (39) అనే మహిళను ఆమె దగ్గరి బంధువులే తీవ్రంగా హింసించి అత్యాచారం చేయడంతో అవమానభారం భరించలేక ఆత్మహత్య చేసుకుంది. ఇది ఎంతటి దారుణమైన ఘటనో వైద్యులు చెప్పిన వివరాలు వింటే అర్థమవుతుంది. ఆమెపై సాముహిక అత్యాచారం చేయడమే కాకుండా బ్లేడ్లతో తొడలు, రొమ్ములు, మర్మాంగాలు కూడా కోశారని వైద్యులు తెలిపారు. మూడు బ్లేడ్లు రొమ్ముల్లోనే ఉన్నాయని, మర్మాగాల్లో రాళ్లు కూడా కుక్కారని వైద్యులు వివరించారు. సోమవారం రాత్రి జరిగిన ఈ కీచక పర్వాన్ని ప్రపంచానికి తెలియకుండా మూసిపెట్టినా 'ప్రజాశక్తి', 10టివి బయటకు తీశాయి. ఆ గ్రామానికి వెళ్లి పూర్వాపరాలు సేకరించింది. పదేళ్ల క్రితం యాదమ్మ భర్త నర్సింహులు మతిస్థిమితం కోల్పోయి తప్పిపోయాడు. ఆమె పిల్లలు మహేష్‌ (23), రవి (15) సికింద్రాబాద్‌లోని మోండా మార్కెట్‌లోని ఒక హోటల్‌లో పనిచేస్తున్నారు. యాదమ్మ భర్తకు, ఆయన బావ బిక్షపతి ఇంటి పక్కనే స్థలం ఉంది. భర్త పోయాక ఇల్లు సగం వరకు కట్టిన ఇంటిని బిక్షపతి కూల్చడమే కాకుండా యాదమ్మ భర్తకు రావాల్సిన మూడెకరాల పొలాన్ని తన పేరున రాయించుకున్నాడు. భర్త పోయినప్పటి నుంచి పొలం తన పిల్లలకు చెందాలని పోరాటం చేస్తున్న యాదమ్మ కులపెద్దలను ఆశ్రయించినా పట్టించు కోలేదు. పొలం నీపేర రాస్తానంటూ బిక్షపతి అమాయకురాలైన యాదమ్మను లొంగదీసుకున్నాడు. కొంత కాలం తర్వాత బిక్షపతి కుమారుడు చిన్నమ్మ వరసైన యాదమ్మపై కన్నేశాడు. ఏప్రిల్‌ 28న గజ్వేల్‌లో కేసిఆర్‌ ఎన్నికల బహిరంగ సభకు వెళ్లి వచ్చిన యాదమ్మను సాయంత్రం నుంచి బిక్షపతి, కనకయ్య కొట్టారు. రాత్రి 8.30కు వీరిద్దరితో పాటు మరో ముగ్గురు సాముహిక అత్యాచారం చేశారు. ఆ గాయాలతోనే యాదమ్మ న్యాయం చేయాలని సర్పంచు దగ్గరికి వెళ్లగా తెల్లవారి పంచాయతీ పెట్టి సమస్య పరిష్కరిస్తానని చెప్పడంతో గ్రామ కావలికారు ముత్యాలమ్మ దగ్గరికి వెళ్లి కొద్దిసేపటికే పురుగుల మందు తాగింది. ఈ విషయాన్ని ముత్యాలమ్మ సర్పంచుకు తెలియచేయ డంతో గజ్వేల్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. కొద్దిసేటికే అక్కడే ప్రాణాలొదిలింది. బిక్షపతి, కనకయ్య, మరో ముగ్గురు కలిసి ఖరాబు (అత్యాచారం) చేశారని యాదమ్మ మరదలు లక్ష్మి తెలిపింది. 
                  పోస్ట్‌మార్టం చేసిన వైద్యురాలు అత్యాచారం జరిగినట్లు ధ్రువీకరించారని తెలిపింది. నిందితులను కఠినంగా శిక్షించాలని, అప్పటివరకు ఆమె అంత్యక్రియలు జరపకూడదని యాదమ్మ తరపువారు భీష్మించుకు కూర్చున్నారు. ఐకెపి మహిళలు ఆందోళన చేశారు. జర్నలిస్టులు చొరవ తీసుకొని నచ్చచెప్పడంతో బుధవారం అంత్యక్రియలు పూర్తయ్యాయి. యాదమ్మపై సామూహిక అత్యాచారం చేసిన దోషులను ఉరితీయాలని ఐకెపి మహిళా సంఘం తునికి బొల్లారం అధ్యక్షులు ఆండాలు డిమాండ్‌ చేశారు. 
'రక్షించాలని కాళ్లపై పడింది'
                  తునికి బొల్లారం సర్పంచి బాలేష్‌ను 'ప్రజాశక్తి' కలిసి మాట్లాడింది. ' సోమవారం రాత్రి 8.30 గంటలకు యాదమ్మ మా ఇంటికి వచ్చింది. అప్పుడు నేను ఇంట్లో లేను. వచ్చినప్పటి నుంచి భోరు ఏడుస్తూనే ఉందని నాభార్య చెప్పింది. నేను 8.50 గంటలకు ఇంటికి వచ్చాను. రాగానే యాదమ్మ నా కాళ్లపై పడింది. తన భర్త బావ, ఆయన కొడుకు మూడు రోజుల నుంచి తనను కొడుతున్నారని, రక్షించాలని వేడుకుంది. ఇప్పుడు రాత్రయ్యింది కదా, రేపు ఉదయం పంచాయతీ కార్యాలయం వద్ద వారిని పిలిచి మాట్లాడతానని చెప్పాను. ఇంటికి వెళ్లడానికి భయంగా ఉందని చెబితే ఇక్కడే మా ఇంటి బయట పడుకో అని చెప్పాను. కొంత సేపయ్యాక ఇక్కడ (దళితుని ఇంటి దగ్గర) పడుకుంటే కులం వాళ్లు మళ్లీ తనను వేధిస్తారని చెబితే గామ కావలికారు ముత్యాలమ్మ దగ్గరికి వెళ్లమని చెప్పాను. ఆ తరువాత పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుందని తెలిసింది. దీంతో అంబులెన్స్‌కు ఫోన్‌ చేసి యాదమ్మను గజ్వేల్‌ ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లాను' 
'నేను చచ్చిపోతా. బతకను'
                  గ్రామ కావలికారు ముత్యాలమ్మ 'ప్రజాశక్తి' మాట్లాడుతూ బిక్షపతి, ఆయన కొడుకు కనకయ్య తనను కొడుతున్నారని యాదమ్మ చెప్పింది. ఇక్కడే పడుకో అని చెబితే, కొంత సేపయ్యాక నేను వెళ్తానని అనడంతో నేను కూడా వెంట వెళ్లాను. బిక్షపతి ఇంటి ఎదురుగా ఉన్న షాపు వద్ద యాదమ్మతోపాటు నేను కూడా కూర్చున్నా. కొద్దిసేపయ్యాక యాదమ్మ తనతోపాటు తెచ్చుకున్న పురుగుల మందు తాగింది. 'మా ఇంటికి వచ్చినప్పుడు ఆమె ఒంటినిండా కొంగు కప్పుకుని ఉంది. మంట మంటగా ఉందని చెప్పింది. మాటల్లో ఆవేదన, కోపం, ద్వేషం కనిపించింది. కూర్చోమని చెప్పినా, సరిగ్గా కూర్చోలేకపోయింది' అని చెప్పింది. 
ఆత్మహత్య ప్రేరేపణ కింద కేసు నమోదు
                  యాదమ్మ మృతిపై యాదమ్మ అన్న సత్తయ్య ఫిర్యాదు చేశారని ములుగు ఎస్‌ఐ బి.కమలాకర్‌ తెలిపారు. ఆత్మహత్య ప్రేరేపణ కింద కేసు నమోదు చేశామన్నారు. పోస్ట్‌మార్టం రిపోర్టు రావడానికి మరో వారం రోజులు పడుతుందన్నారు. పోస్ట్‌మార్టం రిపోర్టు వచ్చాక అత్యాచారం జరిగిందని తేలితే నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేస్తామని చెప్పారు. కనయ్యను తాము అరెస్టు చేశాని, తర్వాత బిక్షపతి లొంగిపోయారని చెప్పారు.
'నిర్భయ' కేసు నమోదు చేయాలి
                                 మెదక్‌ జిల్లా తునికి బొల్లారంలో యాదమ్మ అనే మహిళపై అత్యంత పాశవికంగా సామూహిక అత్యాచారం జరిపిన దోషులపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేయాలని పలు మహిళా, ప్రజా సంఘాలు డిమాండ్‌ చేశాయి. తద్వారా దోషులను కఠినంగా శిక్షించాలని కోరాయి. ఈ దారుణ ఘటనకు సంబంధించిన పూర్వాపరాలు తెలుసుకునేందుకు, అక్కడి మహిళల్లో ధైర్యాన్ని నింపేందుకు ఆదివారం తునికి బొల్లారంలో పర్యటించాలని ఆయా సంఘాల నాయకులు నిర్ణయించారు. యాదమ్మ కుటుంబ సభ్యులకు పూర్తి న్యాయం జరిగేంతవరకు మహిళా, ప్రజా సంఘాలు ఐక్య ఉద్యమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఈ విషయమై మెదక్‌ జిల్లా ఎస్పీకి, కలెక్టర్‌కు, రాష్ట్ర గవర్నర్‌కు వినతిపత్రాలు సమర్పించాలని నిర్ణయించారు. అత్యాచార ఘటనను ఖండిస్తూ శనివారం హైదరాబాద్‌లో రౌండ్‌టేబుల్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐద్వా రాష్ట్ర అధ్యక్షులు టి.జ్యోతి మాట్లాడుతూ యాదమ్మపై అత్యాచారం జరిపిన తీరు సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునే విధంగా చేసిందన్నారు. ఢిల్లీలో జరిగిన 'నిర్భయ' ఘటనను ప్రపంచం మొత్తానికి తెలిసేలా చేసిన మీడియా, పేద మహిళపై జరిగిన ఈ ఘోరాతి ఘోరాన్ని పట్టించుకోకపోవటం శోచనీయమన్నారు. ఎలక్ట్రానిక్‌, సోషల్‌ మీడియాలో ప్రసారమవుతోన్న వివిధ నేర కథనాలు కూడా ఇలాంటి కిరాతక చర్యలకు దోహదమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సమాజంపట్ల మీడియా తన గురుతర బాధ్యతను గుర్తెరిగి స్వీయ నియంత్రణను పాటించాలని సూచించారు. 

No comments:

Post a Comment